Jump to section

ఎనిమిదవ పాఠము – దేవుని వాక్యమును ప్రార్థనా-పఠనము చేయుట

ఎఫె. 6:17-18రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.

దేవునికి ప్రార్థించుటకు బైబిల్‌లోని మాటలను ఉపయోగించుట

ఆత్మయే దేవుని వాక్యమని [ఎఫెసీయులు 6:17] తెలియజేయును. ఆత్మయు వాక్యము రెండు క్రీస్తే (2 కొరి. 3:17; ప్రక. 19:13).

దేవుని వాక్యమును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేత మనము పొందుకోవాలి. ఎఫెసీయులు 6:17 మరియు 18 ప్రకారము, దేవుని వాక్యమును ప్రతి విధమైన ప్రార్థన చేత మనము తీసుకోవాలి. దేవునికి ప్రార్థించుటకు బైబిల్‌లోని మాటలను ఉపయోగిస్తూ, ప్రార్థన-పఠనము చేత, అనగా, లేఖనములోని మాటలతో ప్రార్థన చేయుట చేత మరియు వాటినే ప్రార్థించుట చేత మనము వాక్యమును తీసుకోవచ్చని ఈ వచనములు తెలియజేయును. ప్రార్థన-పఠనము అనే పదము బైబిల్‌లో కనుగొనబడదు. అయితే, ప్రార్థన-పఠనము చేయుట అనే వాస్తవము లేఖనానుసారమైనదై ఉంది. (Life-study of Ephesians, p. 817)

ప్రార్థనతో మరియు ప్రార్థన చేత వాక్యమును చదవడం అన్నది వాక్యమును చదువుటకున్న ఉత్తమమైన మార్గమైయుండుట

వాక్యమును ప్రార్థనతోను మరియు ప్రార్థన చేతను చదువుట, అనగా వాక్యమును ప్రార్థన-పఠనము చేయుట అన్నది వాక్యమును చదువుటకున్న ఉత్తమమైన మార్గమై ఉంది. వట్టిగా చదువుటకు మన కళ్ళు, మన మనస్సు, మన మనస్తత్వముమాత్రమే అవసరము. కాని దేవుని వాక్యమును మన వ్యక్తిత్వపు లోతుల లోనికి స్వీకరించుటకు, మన ఆత్మ అవసరము, మరియు మన ఆత్మను సాధకము చేయుటకున్న ప్రబలమైన మార్గము ప్రార్థించుటయే. మనము ప్రార్థించినప్పుడెల్లా, మన ఆత్మను అప్రయత్నంగానే మనము సాధకము చేస్తాము. అప్పుడు మన కళ్ళతో మనము చదివేది మరియు మన మనస్తత్వములో మనము అర్థం చేసుకునేది మన ప్రార్థన ద్వారా మన ఆత్మలోనికి వెళ్ళును. బైబిల్‌లోని ప్రతి మాటను మనము ప్రార్థన-పఠనము చేయాల్సిన అవసరత ఉంది. (CWWL, 1987, vol. 2, “The God- ordained Way to Practice the New Testament Economy,” p. 375)

దేవుని వాక్యమును మన ఆత్మతో ప్రార్థన-పఠనము చేయుట

మనము చూసేదానంతటిని మరియు మనము అర్థం చేసుకునే దానంతటిని ప్రార్థనలోనికి మారుస్తూ, మనము ప్రార్థన-పఠనము చేయాలి. మనము ప్రార్థించినప్పుడు, మన ఆత్మను మనము ఉపయోగిస్తాము. మొదట, ప్రార్థించుటకు మన మనస్సును మనము ఉపయోగించవచ్చు, కాని మూడు నుండి ఐదు మాటల తరువాత మన ఆత్మ లేచును. ఇది నిర్దిష్టమైన వాస్తవము. కావున, దేవుని వాక్యము యొక్క సారము దేవుడు బయటకు ఊదినదేనని ఎన్నడు మరచిపోవద్దు. మీరు దానిని చదివినప్పుడు, మీరు దానిని లోనికి శ్వాసించాలి. దేవుని వైపుగా, అది ఆయన బయటకు ఊదుటకు సంబంధించిన విషయమై ఉంది; మన వైపుగా, అది మనలోనికి శ్వాసించడమునకు సంబంధించిన విషయమై ఉంది. ఆత్మీయ ఊపిరి ఆయనలోనుండి బయటకు వచ్చును మరియు మనలోనికి ప్రవేశించును. ఆయనలోనుండి బయటకు వచ్చి మనలోనికి ప్రవేశించేదే ఆత్మీయ ఊపిరి. దేవుని వాక్యము ఆత్మయు జీవమునై ఉంది. మన మనస్సు ఆత్మను తాకలేదు; మన ఆత్మ మాత్రమే ఆత్మను తాకగలదు. ఆత్మను మనము తాకకపోతే, మనకు జీవము ఉండదు. ఆత్మను తాకుట చేత మాత్రమే మనము జీవమును కలిగియుండగలము. అంతిమంగా, ఈ జీవము క్రీస్తే, మరియు అది దేవుడు కూడ అయ్యున్నాడు.

మొదట, మనము చదివిన దానిని మనము వివరించాల్సిన అవసరము లేదు మనము దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరత లేదు; వాక్యమును ఉన్నదున్నట్లుగా మనము ప్రార్థన-పఠనము చేయవలెను. మనము ప్రార్థన-పఠనము చేసినప్పుడు, మన ఆత్మ బైబిల్‌లోని ఆత్మను తాకును మరియు మనము జీవమును పొందుకుందుము. (CWWL, 1985, vol. 4, “The Full Knowledge of the Word of God,” p. 145)

ప్రభువు మాటను ప్రార్థన-పఠనము చేయుటను అభ్యసించుట

వ్యక్తిగతముగా ప్రార్థన-పఠనము చేయుట

వాక్యము యొద్దకు వచ్చుటకున్న సరైన విధానమును మనము ఇప్పుడు చూడాలి. సరైన విధానము ఏమిటి? ఎఫెసీయులు 6:17-18లో గ్రంధస్థం చేయబడినట్టుగా దేవుని వాక్యమును మనము చూడాలి. ఈ గ్రంథభాగము ప్రకారము దేవుని వాక్యమును మనము ఏ విధానములో తీసుకోవాలి? ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేత తీసుకోవాలి. దీనిని మనము ప్రార్థన-పఠనము అని పిలుస్తాము! మరల, మనము చెప్పాలి దేవుని వాక్యము ప్రతి విధమైన ప్రార్థన చేత తీసుకోబడాలి.

వాక్యమును తీసుకొని, ఉదయము సాయంత్రము కొన్ని వచనములను ప్రార్థన-పఠనము చేయుడి. కొంత ఉచ్చారణను సంపాదించుకొనుటకుగాను మీ మనస్సును సాధకము చేయాల్సిన అవసరత లేదు, మరియు మీరు చదివిన దానిని గూర్చి ఆలోచించుట అవసరము లేదు. మీరు చదివిన అవే మాటలతో ప్రార్థించుడి. ప్రతి పేజీలో మరియు ప్రతి వచనములో సజీవమైన ప్రార్థన ఉంది.

ప్రార్థన-పఠనము చేస్తున్నప్పుడు మీ కళ్ళను మూయనక్కరలేదు. మీరు ప్రార్థిస్తుండగా మీ కళ్ళను వాక్యముపై ఉంచుడి. మనము ప్రార్థించునప్పుడు మన కళ్ళను మూయనక్కర లేదని మనము గ్రహించాలి. మన మనస్సును మూయడం మంచిది!

మీరు ఏ మాటలను కూర్చుకోనక్కర లేదు లేదా ప్రార్థనను కల్పించుకోనక్కరలేదు. కేవలం ప్రార్థన-పఠనము చేయుడి. బైబిల్‌లోని మాటలు అవి సరిగ్గా చదువబడినట్టుగా వాటిని ప్రార్థించుడి. తుదకు, బైబిల్ అంతయు ప్రార్థనా పుస్తకము అయ్యుందని మీరు చూస్తారు! బైబిల్‌లోని ఏ పేజీనైనా మీరు తెరవగలరు మరియు వాక్యముకు చెందిన ఏ గ్రంధ భాగమునైనా ప్రార్థించుటను ప్రారంభించగలరు.

మీరు రోమా పత్రికంతటితో చాల సుపరిచితులై ఉండవచ్చు. కాని నేడు కూడ, మీరు దానిలోని ఒకటి లేదా రెండు వచనములను ప్రార్థన-పఠనము చేయాల్సిన అవసరత ఇంకను ఉంటుంది. ఆహారమును గూర్చి అంతయు మనకు తెలిసి ఉండవచ్చు, అయిననూ అనుదినము కొంత ఆహారమును మనము ఇంకను పుచ్చుకోవాలిగా. దానిని గూర్చి మనకెంత తెలిసినప్పటికీ కూడ, మనము దానిని ఇంకా తినవలెను గదా! తెలుసుకొనుట అన్నది ఒక విషయము కాని తినుట అన్నది మరో విషయము. మీరు అనేక సంవత్సరాలుగా క్రైస్తవులై ఉండవచ్చు, కాని మీరు ఎంత కాలము నుండి క్రైస్తవులై ఉన్నారో అన్న దానితో సంబంధము లేకుండా మరియు ఈ పత్రికను మీరు ఎన్ని సార్లు చదివారో అన్న దానితో సంబంధము లేకుండా, మీరు దానిని చదువుట మాత్రమే కాక దానిని ప్రార్థన-పఠనము చేయాలి! దినదినము మీరు దానిని తినాలి, దానిలో పాలొందాలి, మరియు దానిని ఆస్వాదించాలి.

ఇతర క్రైస్తవులతో ప్రార్థన-పఠనము చేయుట

అధికమైన ఆస్వాదన మరియు పోషణ కొరకు మరియు వాక్యమును సరిగ్గా మరియు తగినంతగా ప్రార్థన-పఠనము చేయుటకు, మనకు దేహము, అనగా సంఘము అవసరము. వాక్యమును వ్యక్తిగతముగా ప్రార్థన-పఠనము చేయడాన్ని మీరు ఆస్వాదించవచ్చు, కాని గుంపుగా ఇతర క్రైస్తవులతో దానిని చేయడాన్ని ప్రయత్నిస్తే, మనము మూడవ ఆకాశములో ఉందుము! దీనికి గల వివరణ ఏదంటే ఆహారమన్నది ఒక్క అవయవముకు మాత్రమే కాక దేహమంతటికి అయ్యుంది. కావున, ప్రార్థన-పఠనము చేయుటకున్న ఉత్తమమైన మార్గము దేహములోని ఇతర అవయవములతో ప్రార్థన-పఠనము చేయడమే. ఒంటరిగా ప్రార్థన-పఠనము చేయడం చేత మీరు ప్రయోజనమును పొందుదురు, కాని ఇతర సోదరీసోదరులతో కూడి వచ్చినప్పుడు మీరు వ్యత్యాసమును చూస్తారు.

ప్రార్థన-పఠనము చేయుటకున్న నాలుగు తాలపు చెవులు-

త్వరగా, చిన్నగా, యథార్థంగా మరియు తాజాగా

మనము ఇతర సోదరీసోదరులతో ప్రార్థన-పఠనము చేయుటకు కూడి వచ్చినప్పుడు, మనము గుర్తుంచుకోవాల్సిన నాలుగు మాటలు ఉన్నాయి: త్వరగా, చిన్నగా, యథార్థంగా మరియు తాజాగా. మొదట, సందేహించకుండా మనము త్వరగా ప్రార్థించాలి. ప్రార్థించుటకు మనము త్వరపడినప్పుడు, మన మనస్సును ఉపయోగించుటకు మరియు పరిగణించుటకు మనకు సమయముండదు. తరువాత మన ప్రార్థనలు చిన్నగా ఉండాలి, ఎందుకంటే దీర్ఘ ప్రార్థనలకు కొంత కూర్పు అవసరము. దీర్ఘ ప్రార్థనను కూర్చుకొనుటను గూర్చి మనము మరచిపోవాలి మరియు ఒక పదబంధమునో లేదా మాటనో మనము ఉచ్చరించాలంతే. దానిని త్వరగా మరియు చిన్నగా చేయుడి. మనము నటిస్తున్నట్టుగా ఉండక, యథార్థముగా ఉండాలి. యథార్థంగా ఒకదానిని చెప్పుడి. ఆఖరిగా, మన ప్రార్థనలు పాతవిగా కాక తాజాగా ఉండాలి. తాజాగా ఉండుటకున్న మంచి మార్గము మన సొంత మాటలతో కాక బైబిల్‌లోని మాటలతో ప్రార్థించుటయే. ఈ గ్రంథములోని ప్రతి భాగము మరియు ప్రతి వరుస ప్రార్థనగా ఉపయోగించబడగలదు మరియు అది తాజాయైన ప్రార్థనగా ఉండును!

దేవుని వాక్యమునొద్దకు వచ్చుటకు ఇది సరైన విధానమని వేలాదిమంది నిరూపించిరి. అది వారి జీవితాలను విప్లవాత్మకంగా చేసెను. మొదట్లో అది వింతగా అనిపించవచ్చు, కాని అభ్యాసము మరియు నిజాయితీ హృదయముతో, సజీవమైన ఆత్మను మీరు తాకుదురు. దీనిని వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా మీరు ప్రయత్నిస్తే, దేవుని వాక్యమును ప్రార్థన-పఠనము చేయడం చేత మీకు చొప్పింపబడిన క్రీస్తు ఐశ్వర్యములను గూర్చి మీరు సాక్ష్యమివ్వగలరు. మీ ఆత్మీయ జీవితంలో మీరు ఆశీర్వాదమును మరియు ఎదుగుదలను చూచుదురు. గొప్ప మార్పు ఉండును. క్రీస్తును ఆస్వాదించుటకు మరియు ఆయన చేత పోషింపబడుటకు ఈ విధంగా వాక్యమును సంప్రదించుట చేత, మీరు జీవముతో నిండుకొనియున్న మరియు ఈ సజీవమైన వానితో పూర్తిగా నింపబడి, పరిపక్వతకు ఎదుగుచూ ఉన్న వ్యక్తిగా ఉందురు. (Pray- reading the Word, pp. 7-13)

References: Life-study of Ephesians, msg. 97; CWWL, 1987, vol. 2, “The God ordained Way to Practice the New Testament Economy,” ch. 8; CWWL, 1985, vol. 4, “The Full Knowledge of the Word of God,” ch. 2; Pray-reading the Word

 

హృదియు ఆత్మయు దప్పిగొనెన్

వాక్య అధ్యయనము—వాక్యమును భుజించుట

811

1   హృదియు ఆత్మయు దప్పిగొనెన్

ప్రభూ నీ చెంతకు జేరితిని

నే కోరుకున్నది నిన్నేనయ్యా

ఆకలిదప్పులు తీర్చుమయ్యా

 

అన్నపానముల్ దయచేసి

ఆకలిదప్పులను  తీర్చి

ఆనందబలములనిచ్చియు

తృప్తిపర్చుము ఓ యేసయ్యా

 

2   జీవాహారమున్,  జీవజలమున్

నీవే ప్రభూ మాదు ఆత్మలకు

నిన్నే తినుచు నిన్నే త్రాగుచు

ప్రార్థనా పఠనము చేతును

 

3   నీవే దేవుని వాక్యమైయుండి

జీవమిచ్చు దైవాత్మవైతివి

వాక్యమందు నిన్నే భుజింతును

ఆత్మగా నిన్ను నే త్రాగుదును

 

4   పరమాహారమై వచ్చితివి

చీల్చబడి పానమువైతివి

తరగని సరఫరానిచ్చి

జీవప్రవాహములైయుంటివి

 

5   ఆత్మయు జీవమునైయున్నట్టి

నే భుజించునట్టి వాక్యమీవే

ఆత్మగా నా ఆత్మలో వసింప

నిన్నే నా ఆత్మలో త్రాగుదును

 

6   నిన్నాస్వాదింపను నేనిప్పుడు

వచ్చితివి వాక్యము చెంతకు

ఆత్మలో నీ తట్టు తిరిగితిన్

తృప్తినొందువరకు త్రాగుదున్

 

7   తినుచు త్రాగుచు ప్రభూ నిన్నే

పఠన చేసి తృప్తినొందుదున్

ప్రార్థనచే నిన్నే త్రాగుదును

ప్రార్థనా పఠన చాలు నాకు

 

8   నిన్నిచ్చట భుజించునట్లుగా

నీ ఆత్మను నాపై క్రుమ్మరించి

నీ వాక్యముతో నన్నును నింపి

గొప్ప విందుగా నాకుండుమయ్యా

 

Jump to section